ధోనీ గురించి నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న వార్త.. కలవర పడుతున్న క్రికెట్ అభిమానులు..

టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రిటైర్‌మెంట్‌ గురించి గత కొంతకాలంగా ఎన్నో వార్తలు వస్తున్నాయి. సారధిగా జట్టకు ఎన్నో విజయాలు అందించిన ధోనీ.. కొద్ది రోజుల నుంచి తన ఫామ్ కోల్పోయాడు. గతంలో ఆడినట్లుగా ధోనీ ఇప్పుడు రాణించలేకపోవడంతో అతను క్రికెట్ నుంచి తప్పుకోవాలంటూ.. ఫ్యాన్స్ డిమాండ్ చేయడం ప్రారంభించారు. అతను జట్టు నుంచి తప్పుకుంటే.. యువ క్రికెటర్లకు అవకాశం లభిస్తుందని, అది జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని వాళ్ల అభిప్రాయం. మరోవైపు ఇంకో వర్గం ఫ్యాన్స్, జట్టు సభ్యులు మాత్రం ధోనీకి అండగా.. నిలిచారు. అతను జట్టులో ఉండటం ఎంతో ముఖ్యమని.. అంతేకాక, ఎప్పుడు రిటైర్ కావాలో ధోనీకి బాగా తెలుసు అనేది వాళ్ల వాదన.

అయితే ప్రపంచకప్ ముగిసిన తర్వాత అంతా ధోనీ రిటైర్ అవుతాడని భావించారు. కానీ అనూహ్యంగా అతను రెండు నెలల పాటు సెలవు తీసుకొని భారత ఆర్మీతో కలిసి సేవలు అందించాడు. అయితే రెండు నెలల పాటు సెలవు కాలం ముగిసినప్పటికీ ధోనీ జట్టుతో చేరలేదు. దీంతో ధోనీ రిటైర్‌మెంట్ తీసుకున్నాడంటూ.. మళ్లీ వార్తలు రావడం ప్రారంభమైంది. అంతేకాక.. ట్విట్టర్‌లో ‘ధోనీ రిటైర్స్’ అనే హ్యాష్‌ట్యాగ్ కూడా రాత్రికిరాత్రి వైరల్‌గా మారింది. ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పాటు.. ‘థ్యాంక్యూధోనీ’, ‘నెవర్‌రిటైర్‌ధోనీ’ అనే ట్యాగ్స్‌ కూడా వైరల్ కావడంతో అతని అభిమానుల్లో కలవరం మొదలైంది. తమ అభిమాన క్రికెటర్ కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడి.. రిటైర్‌మెంట్ ప్రకటిస్తే బాగుండు అని అనుకొనే వాళ్లంతా ఒక్కసారిగా కంగారు పడ్డారు. అయితే ఇది అధికారిక సమాచారం కాదని.. ఎవరో కావాలని పుకారు పుట్టించారనే విషయం తెలియడంతో.. వాళ్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాక.. ఆ హ్యాష్‌ట్యాగ్స్ చూసి కంగారు పడ్డ వాళ్లకి.. ఇది ఫేక్ వార్త అని క్లారిటీ ఇస్తున్నారు. ధోనీ 2020లో జరిగే టీ-20 ప్రపంచకప్ కచ్చితంగా ఆడి తీరుతాడని వాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

 

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *