డబుల్ సెంచరీతో సచిన్ రికార్డులను బద్దలు కొట్టిన స్టీవ్ స్మిత్

యాషెస్‌ సిరీస్‌ ద్వారా టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన స్మిత్‌ తొలి టెస్టులో (144, 142), రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేశాడు. రెండో టెస్టులో ఆర్చర్‌ వేసిన బంతికి గాయపడిన స్మిత్ రెండో ఇన్నింగ్స్‌తో పాటు మూడో టెస్టుకు దూరమయ్యాడు. ఈ యాషెస్‌ సిరీస్‌లో ఇప్పటివరకూ స్మిత్‌ 147. 25 సగటుతో 589 పరుగులు సాధించాడు.

యాషెస్ సిరిస్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో రెండు సెంచరీలు బాదిన స్టీవ్ స్మిత్ గురువారం మాంచెస్టర్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు.

నాలుగో టెస్టులో డబుల్ సెంచరీ సాధించడంతో స్టీవ్ స్మిత్ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అవేంటో ఒక్కసారి చూద్దాం…

స్మిత్ మూడు సార్లు 500కుపైగా

3 – ప్రతిష్టాత్మక యాషెస్ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ మూడు సార్లు 500కుపైగా పరుగులు చేశాడు. ఈ జాబితాలో సర్ డొనాల్డ్ బ్రాడ్ మన్(5) అగ్రస్థానంలో ఉండగా… సర్ జాక్ హాబ్స్ కూడా 3 సార్లు 500కుపైగా పరుగులు చేశాడు. అయితే, స్టీవ్ స్మిత్ వరుసగా మూడు యాషెస్ సిరిస్‌లలో ఈ ఘనత సాధించడం విశేషం.

3 – యాషెస్‌లో వరుసగా మూడు డబుల్ సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా స్టీవ్ స్మిత్ నిలిచాడు. ఈ జాబితాలో సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్ ఎనిమిది డబుల్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా వాల్లీ హామండ్ 4 డబుల్ సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే బ్రాడ్‌మన్, హామండ్‌లు యాషెస్‌లో వరుసగా డబుల్ సెంచరీలు సాధించలేదు.

వరుసగా ఎనిమిది హాఫ్ సెంచరీలు

8 – యాషెస్ సిరిస్‌లో స్టీవ్ స్మిత్ వరుసగా ఎనిమిది హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. గత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో స్టీవ్ స్మిత్ సాధించిన పరుగులు 239, 76, 102 నాటౌట్, 83, 144, 142, 92, 211. అయితే, వీటిలో స్మిత్ ఐదు ఇన్నింగ్స్‌లను సెంచరీలుగా మలచడం విశేషం.

11- ఇంగ్లాండ్‌పై స్టీవ్ స్మిత్ సాధించిన టెస్టు సెంచరీలు. ఈ జాబితాలో డాన్‌ బ్రాడ్‌మన్‌(19 సెంచరీలు, ఇంగ్లండ్‌పై), సునీల్‌ గావస్కర్‌(13 సెంచరీలు, వెస్టిండీస్‌పై), జాక్ హాబ్స్‌(12 సెంచరీలు, ఆసీస్‌పై)లు స్మిత్‌ కంటే ముందున్నారు. గత 25 ఏళ్లలో ఇంగ్లీషు గడ్డపై డబుల్‌ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌.

స్టీవ్ స్మిత్ యావరేజి అద్భుతం

64.55 – టెస్టుల్లో 121 ఇన్నింగ్స్ ఆడిన తర్వాత స్టీవ్ స్మిత్ యావరేజి ఇది. టెస్టుల్లో 100కు మించి ఇన్నింగ్స్‌లు ఆడిన ఏ బ్యాట్స్‌మెన్ కూడా ఇంతటి యావరేజిని కలిగి లేడు. ప్రస్తుతం టెస్టుల్లో స్టీవ్ స్మిత్ 6788 పరుగులు చేశాడు. ఇదే టెస్టుల్లో అత్యధిక యావరేజి కావడం విశేషం. ఈ క్రమంలో స్మిత్ వాలీ హమ్మండ్ (6604 పరుగులు) యావరేజిని బద్దలు కొట్టాడు.

121 – టెస్టుల్లో 26 సెంచరీని అందుకోవడానికి స్టీవ్ స్మిత్‌కు అవసరమైన ఇన్నింగ్స్‌లు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు డాన్‌ బ్రాడ్‌మన్‌(69 ఇన్నింగ్స్‌లు) మాత్రమే స్టీవ్ స్మిత్ కంటే ముందున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో సచిన్ టెండూల్కర్(136), సునీల్‌ గవాస్కర్‌ (144), మాథ్యూ హెడెన్‌ (145)లు ఉన్నారు.

సచిన్ రికార్డు బద్దలు

టెస్టుల్లో 26వ సెంచరీ అందుకున్న స్మిత్‌ క్రికెట్‌ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌ను సైతం అధిగమించాడు. ఈ క్రమంలో అతి తక్కువ ఇన్నింగ్స్‌లో 26 సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సచిన్‌ను దాటి రెండో స్థానంలో నిలిచాడు. స్టీవ్ స్మిత్‌ 121 ఇన్నింగ్స్‌ల్లో 26 సెంచరీలు సాధించగా… సచిన్ టెండూల్కర్ 136 ఇన్నింగ్స్‌ల్లో చేశాడు.

కీ టాగ్స్: త్రిష, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ, అల్లు అర్జున్, స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా క్రికెటర్,

Leave A Comment

Your email address will not be published. Required fields are marked *